Saturday 26 September 2015

తామసి కర్మలు



హైదరాబాద్ లో......ఓ వాటర్ పార్క్....

'టాపు లేచిపోద్ది...ఈలే వేశావంటే...!
టాపు...టాపు...టాపు లేచిపోద్దిరో....' లాంటి హుషారైన పాటలతో ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తోంది. అలాంటి ఊపున్న పాటలకి రెయిన్ డాన్స్ లాంటి ప్రదేశం తోడైతే, ఇంక కుర్రకారు గురించి, ప్రేమికుల గురించి వెరే చెప్పనక్కరలేదు... ఈలలు,గోలలతో, కిర్రెక్కించే యువత డాన్స్ స్టెప్పులతో మాంచి జోరుగా ఉంది.

రోజూ కలసి షికార్లుకెళ్ళే ప్రేమికులే అయినా ఈరోజెందుకో చాలా కొత్తగా ఉంది వాళ్ళకి. బహుశా వాళ్ళిద్దరూ కలసి వాటర్ పార్క్ కి రావడం ఇదే మొదటిసారేమో...తడి అందాలలో ప్రేయసిని వర్నించడానికి తనకు తెలిసిన భాష సరిపోవట్లేదు అతనికి....కొంటె చూపులు...చిలిపి స్పర్శలు...రెయిన్ డాన్స్...ఎంత బావుందో...!!?!

ప్రేమికుడే అయినా అతనెప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. పైగా తల్లితండ్రులు లేక పోయినా బాధ్యత తెలిసిన కుర్రాడతను, చాలా మంచి వాడు, బాగానే సంపాదిస్తున్నాడు. వచ్చే వారమే ఊరుకి వెళ్ళి వాళ్ళ మామయ్యతో తమ ప్రేమ విషయం చెప్పి పెళ్ళి గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ ధైర్యం తోనే అలా ప్రవర్తిస్తున్నాడేమో...ఆమె సిగ్గుపడుతూ హద్దులు చెరిపేస్తోంది...

వాటర్ పార్క్ సమయం అయిపోతోంది...వచ్చిన వాళ్ళు కొంతమంది బాగా ఆనందించాం అని రిలాక్స్ డ్ గా వెనుతిరుగుతుంటే, కొంతమంది మాత్రం అప్పుడే చీకటి పడుతోందా అని నిరాశగా వెనుతిరుగుతున్నారు.

వీరికి కూడా గడిచిన సమయం సరిపొలేదేమో, ఇంకాసేపు గడపడానికి మాంచి హోటెల్లో డిన్నర్ కి వెళ్ళారు....
తర్వాత అటునుంచే అతని ఫ్లాట్ కి కూడా...

మరుసటి రోజు ప్రొద్దున ఆమెని అమె హాస్టెల్ దగ్గర డ్రాప్ చేశాడు.వారం తరువాత...తన ఊరికి వెళ్ళాడు.

                                                       *                                           *                                           *

తన మామయ్య ఇల్లు...
రాత్రి భోజనాలు అయ్యాక మజ్జిగా తాగుతూ మాట్లాడుకుంటున్నారు...అతను..అతని మామయ్యా.

'సారీ మామయ్య! నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేస్కుంటానని తనకి మాటిచ్చాను కూడా .....
అయినా సంధ్యని నేనెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు.నాతో పాటే పెరిగింది.ఇప్పుడెవరో మోసం చేస్తే దాన్నే తలచుకుంటూ పిచ్చిది అయ్యింది, నన్నే పెళ్ళి చేసుకుని బాగా చూసుకోమంటే ఎలా...

నన్ను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను...సంధ్యని మాంచి డాక్టర్ కి చూపిద్దాం. కావాలంటే సంధ్య కి నయం చేయించి ఒక ఇంటి దాన్ని చేసేవరకు నేను పెళ్ళి కూడా చేసుకోను. సంధ్యని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది...' అన్నాదతను ఆర్ధతః నిందిన కళ్ళతో...

మళ్ళీ తనే మట్లాడుతూ...

'మామయ్య! తల్లితండ్రులు లేని నన్ను ఇంత వాణ్ణి చేశారు...మీకోసం ఏంచేయడానికైన వెనుకాడను...'
మోకాళ్ళపై వాలిపోతూ
 'నన్ను క్షమించండి మామయ్య...ఈ విషయం లో మీతో ఏకీభవించలేను...కాని సంధ్యని మాత్రం నా కంటి కి రెప్పలా చూసుకుంటాను...నన్ను అపార్ధం చేసుకోకండి'.

మామయ్య ఏమీ మాట్లాడలేదు. కాసేపు ఇద్దరూ అలా మౌనంగానే ఆలోచిస్తూండి పోయారు. కాసేపు తర్వత అతను తన గదికి వెళ్ళిపొయాడు. కాని మామయ్య మత్రం అలానే ఆలోచిస్తూనే వుండిపోయాడు.

'నా పిల్లలతో పాటే వాడిని కూడా అల్లారు ముద్దుగా పెంచాను. వాడికి తల్లితండ్రులు లేని లోటు తెలియకుండా పెంచానే, మంచి స్థాయికి చేర్చానే...కనీసం ఇది కూడా...!
ఛ!!
ఆ మాటకొస్తే నా అల్లుడు చాలా మంచి వాడే, నా పిల్లల కన్నా గుణవంతుడు, నా కొడుకు లా జులాయి కాదు, తొందర పడి ఎలంటి తప్పులు చేయడు. అతని మాటలో కూడా నిజాయితీ ఉంది, వేరొక అమ్మాయికి ద్రోహం చేయలేకనే అతనలా ప్రవర్తించాడు...లేకుంటే...'...

.....మమయ్య ఆలోచిస్తున్నాడు...



 'అల్లుడు మాట తప్పే రకం కాదు...తన కూతురే చెప్పిన మాటలు లెక్క చేయక మోసపోయింది, పిచ్చిదయ్యింది....ఈ విషయం నలుగురికి తెలియక ముందే ఎలగైనా దాని జీవితం ఘాడిన పడేయ్యాలి...కొడుకుకి ఆవేశం, ఆస్థి తప్ప వేరొక ధ్యాస లేదు, ఈ విషయం కనుక తెలిస్తే సొంత చెల్లలని చూడకుండా చంపేస్తాడు...అందుకే పరీక్షలలో మార్కులు రాక బాధపడుతోందని చెప్పాల్సి వచింది వాడికి...ఇప్పుడేం చేయాలి...ఎవరితో చెప్పినా పరువు పోతుంది....
                                   ..............................................
                                              ????!!!?@#?!!
                                   ..............................................

అతనికి తన అల్లుడు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి....
'సంధ్యని కంటికి రెప్పలా చుసుకుంటను, కానీ, వేరొకరికి ద్రోహం చేయ్....య...లే.....నూ'

'సంధ్యని కంటికి రెప్పలా చుసుకుంటను,వేరొకరికి ద్రోహం చేయ్....య...లే'

'వేరొకరికి ద్రోహం చేయ్....య..'

'ద్రోహం చేయ్....య్'......

మామయ్య పిడికిలి బిగుసుకుంది....కళ్ళు పెద్దవయ్యాయి.
ఓ భారమైన నిట్టూర్పు ఆ గది మొత్తం వ్యాపించింది.మెరిసే నక్షత్రాలు ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.అతనలానే ఆకాశంలోకి చూస్తూండి పోయాడు.

'సంధ్యని కంటికి రెప్పలా చూసుకుంటాను,కానీ, వేరొకరికి ద్రోహం చేయ్'.....

                              *                                           *                                           *

ఆకాశం క్రమంగా ఎర్రబడుతోంది... సొంతింటి వూరి ప్రభావమో ఏమో...ఇంకాసేపు పడుకోవాలని ఉందతనికి.
కళ్ళు తెరవాలంటె బద్దకంగా ఉంది..కానీ, సన్నగా ఎదో అలికిడి, చిన్న శబ్ధాలు వినిపిస్తున్నాయి....

ధబ్...ధబ్...ధబ్...'రేయ్! తలుపు తీయ్!'
ధబ్..ధబ్..!ఇంతలోనే శబ్దం పెద్దగా వినిపిస్తోంది.

'ఆ...వస్తున్నా'........అతను మంచం దిగేలోపే తలుపు ఘడియ విరిగి తలుపు తెరుచుకుంది...
ఓ ముగ్గురు లోపలికి వచ్చేశారు...

ఊహించని ఆ పరిణామానికి అతను ఆశ్చర్యపోయాడు...'మత్తు' విదిలించుకొని చూశాడు....ఎదురుగా...తన బావమరది...పొరుగింటి వారు...తననే చూస్తున్నారు...చాల ఆవేశంగా..

ఆ అరుపులకు బెదరి నిద్రలేచింది.....తన గదిలోనే....కాదు కాదు....తన పక్కలోనే.........పడుకొని ఉన్న సం...ధ్య! సంధ్య ని చూడగానే అతను నిర్ఘాంతపోయాడు...దిగ్భ్రాంతి...తన గదిలో సంధ్య కాదు, తను పడుకున్నది సంధ్య గదిలోనే....

'ధణ్...వెనుకనుంచి ఎవరో కొట్టారు...అతను వెన్నక్కి తిరిగేలోపు ఎవరో జుట్టు పట్టుకున్నారు...అచేతన స్థితిలో నిద్రలేచిన సంధ్య, తన ఎదురుగా జరుగుతున్న దానికి బిత్తరపోయి...గట్టిగా అరిచి ఏడవసాగింది...

'నా చెల్లెల్నే పాడుచేస్తావ్ రా...' అతని బావమరది బలంగా అతని కడుపులో గుద్దాడు...

'ధబ్' ఒకడు మూతి మీద కొట్టాడు...

'పెంచిన మామయ్యకే ద్రోహం చెశావ్ కదరా...సిగ్గులేని ఎదవా' ఇంకోడు తలమీద కొట్టాడు....ఇంకా ఏవో అనకూడని మాటలు వినపడుతున్నాయి

'అమ్మా!....' గట్టిగ తలపట్టుకొని అరిచాడతను...
తల గిర్రున తిరుగుతొంది....తనేమీ అలోచించలేకపోతున్నాడు...తను రాత్రి తన గదికే(?) వెళ్ళి నట్లు గుర్తు(?)

'ధణ్...'ధణ్....దొరికిన చోటల్లా కొడుతున్నారు...అడుగులు తడబడుతున్నాయి....సంధ్య గట్టిగా ఏడుస్తోంది....

తన మామయ్యతో ఒక్కసారి మాట్లాడాలనిపిస్తోంది...అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు..

                               *                                           *                                           *

'రెయ్...లెయ్!'...ఎవరో ముఖాన నీళ్ళతో కొట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నారు...
'ఆహ్....' శరీర గాయాలు బాధిస్తున్నాయి. అతను లేచి నిలబడ్డాడు.

ఓ పేద్ద చెట్టుక్రింద ముగ్గురు వయసు పైబడ్డ వారు ఏదో మట్లాడుకుంటున్నారు, చుట్టూ ఓ పదిమంది జనం.
మధ్యలో అతను. అతనికి ఎదురుగా తల పట్టుకొని కూర్చున్నాడు తన మామయ్య. మామయ్యని చూడగనే తనకి చాలా సంతోషమనిపించింది.

'మామయ్య!' అని పిలిచాడతను ఆశగా..
'నోరు ముయ్యరా...! చేసింది చాలక మళ్ళీ మామయ్య కావాలంట!' అన్నాడు ఓ పెద్దాయన.
'బంగారం లాంటి మామయ్యకి అంత ద్రోహం ఎలా చేయాలనిపించిది రా....ఆయన్ని చూడు... ఎలా కుమిలి పోతున్నాడో' ఇంకెవరొ అన్నారు.

'ప్లీస్, నాకేమి తెలియదు, నన్ను కసేపు మా మామయ్యతో' మట్లాడనివ్వండీ అన్నాడతను.

'చేసింది చాలక.....ఏంట్రా నువ్ మాట్లాడేది...' తన బామ్మార్ది కడుపులో కొట్టాడు...పక్కనోళ్ళు తన బామ్మర్దిని కొట్టవద్దని వారించారు...
.......
........
...........
ఓ పెద్దాయన మాట్లాడుతూ 'ఇది ఓ ఇంటి పరువు సమస్య!దీన్ని కోర్టు దాకా తీసుకెళ్ళ కుండా, సామరస్యంగా పరిష్కరించుకునేలాగా... పైగా నిందితుడు, బాధితుడు ఒక కుటుంబంలోని వారే కాబట్టి,
భవిష్యత్ సంబంధాలని దృష్టి లో ఉంచుకుని... మా నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం...'

తన మామయ్య వైపు చుస్తు 'మీకుసమ్మతమే అయిన పక్షంలో, మీ అమ్మాయిని మీ అల్లుడికిచ్చి పెళ్ళి చేయవచ్చు.....'

'నేను ఒప్పుకోను, వాడు ఆస్థి కోసమే అంతా చేస్తున్నాడు...వాడొక అనాధ,చిన్నప్పటి నుంచి మా నాన్నే పెంచి చదివించాడు....అయినా వాడు ద్రోహం చేశాడు.ఆస్థి మాత్రం వాడికి ఇవ్వడనికి వీల్లేదు' అన్నాడు తన బావమరది మధ్యలో కల్పించుకొని.

పెద్దాయన కాస్త కోపం గా వారిస్తూ 'మీ ఆవేశాన్ని అర్ధం చేసుకోగలం,కానీ,తీర్పు పూర్తిగా వినాల్సిందిగా కోరుతున్నాను...ఒకవేళ...ఈ నిర్నయం నప్పకపోయినట్లయితే మీరు కోర్టుకి వెళ్ళవచ్చు...'

ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు.....కసేపయ్యాక తీర్పు వచ్చింది...తను తన మామయ్య కూతురుని పెళ్ళి చేసుకోవాలని, మామ ఆస్థిలో వాటా కోరరాదని......అంతకన్నా భరించలేని విషయం...

తన గురించి అన్నీ తెలిసిన తన మామయ్య ఈ తీర్పుని అంగీకరించాడని....

                                 *                                           *                                           *

కొద్ది రోజుల్లోనే వాళ్ళ పెళ్ళి మాత్రం చాలా ఘనంగా జరిగింది...ఊరూ వాడ అంతా వచ్చి వధూవరులను మనస్పూర్తిగా ఆశీర్వదించారు.....
సంబరాల్లో పటాకులు అంబరాన్ని తాకుతున్నాయి...

బావమరదికి ఆస్థి మిగిలిందని సంతోషం కాబోలు...

అదిగో మామయ్య....ఇప్పటి వరకు మామయ్య తనకి కనిపించలేదు, ఇప్పుడే ఆయన్ని చూడడం.మామయ్య కళ్ళల్లో ఉద్వేగంతో కుడిన ఆనందం, కూతురికి భవిష్యత్తు గురించి బెంగ అవసరం లేదన్న ధీమా ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి....

పెళ్ళి వేడుకలు ముగిశాయి, రాత్రి మేడ మీద అటు ఇటు పచార్లు చేస్తున్నాడతను,తన మనసేమీ బావోలేదు, ఒకటే ఆలోచన తన ప్రేయసి గురించి.ఇప్పటికే ఆమే నుంచి పదే పదే కాల్స్ వస్తూనే ఉన్నాయి, అతనికేం చేయలో తెలియట్లేదు, కాల్స్ కట్ చేశాడు.... ఇప్పటికే ఎన్ని సార్లు కాల్ చెసిందో...పాపం

ఎవరినో ఏదో చెయ్యాలన్న ఆవేశం, ఏమీ చేయలేకపోతున్నాననే బాధ అతన్ని మరింత కృంగదీస్తున్నాయి.
 ప్రేయసి నుంచి మళ్ళీ కాల్ వచ్చింది... విసురుగా తన సెల్ ఫోన్ ని దూరంగా విసిరి కొట్టాడు.
బయట ఏదో చెట్టుకి తగిలి విరిగిపోయింది. ఇంతలో తన వెనుకగా అలికిడి అవ్వడంతో వెన్నక్కి తిరిగాడు....
...............................ఎదురుగా విచారమైన మొహంతో, తడిసిన కళ్ళతో తన మామయ్య.

మామయ్య మొహం చూడడం కూడా ఇష్టం లేదతనికి, ఆవేశంగా తల పక్కకి తిప్పాడు.
అతని కళ్ళు అగ్ని పర్వతాన్ని దాచుకున్న సముదృడిలా ఉప్పొంగాయి, గరళం మ్రింగినా శివుడిలా మనసులో నుంచి ఎగసి పడుతున్న భావాల్ని గొంతులోనే అదిమి పట్టేశాడతను. పెను తుఫానుకు ముందు తొలిచినుకు సూచికగా నిశబ్దాన్ని చీలుస్తూ అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.

'ఆరోజు రాత్రి భోజనం లో ఇంత విషం కలిపి ఉండల్సింది మామయ్యా!!'
 అవేశంగా అన్నాడతను పక్కనున్న గోడమీద విసురగ చెయ్యేసి.

మామయ్య సిగ్గుతో తలదించుకున్నాడు...అల్లుడిని చూసే ధైర్యం చేయలేకపోతున్నాడు 'అల్లుడూ...' అని భొరున ఏడ్చేశాడు.అతను మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

'నీ కూతురి జీవితం కోసం మరో ఆడకూతురి జీవితాన్ని నాశనం చేశావు.....నీ కొడుకు కేవలం ఆస్థి కోసమే అంత గొడవ సృస్టించాడు....అన్నీ తెలిసే నువ్ వూరుకున్నావు....

అయినా...నాకు మాత్రం ఎవరున్నారు...అన్నీ నువ్వేగా...అలంటి నువ్వే ఇలాంటి నీచానికి దిగితే నేనేమవ్వాలి....ఎంత బాధపడ్డాను, ఎంత కుమిలిపోయాను....కేవలం నీ పరవు పోతుందనే మౌనంగానే ఉండిపోయాను....
.................................ఛీ!...... ఇదంతా దేనికొసం...

...నీ మొహం చూడాలంటేనేనే ఏదోలా ఉంది....'

'అంత మాట అనకు అల్లుడు....నీ కాళ్ళు పట్టుకుంటాను....అలా చేయల్సి వచ్చింది....తప్పయిపోయింది, నన్ను క్షమి....................న్...................'

'వద్దు..........నన్ను క్షమాపణ కోరి నువ్ మరింత దిగజారకు...
నీ కూతురి గురించి నువ్వేం కంగారు పడకు...తప్పు చేసింది నువ్...అదేం పాపం చేయలేదుకదా...దాన్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను...,కానీ..............,
దయచేసి నీ మొహం నాకెప్పుడూ చూపించకు....వెళ్ళు....' అని గట్టిగా అరిచాడు....

మామాయ్య మరింత కృంగిపోయాడు...అల్లుడివైపు చూశాడు...అతడు కనీసం వెనుతిరిగి కూడా చూడలేదు....
....................'వెళ్తాను అల్లుడు...'

అతనేమి మాట్లాడలేదు. మామయ్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను మాత్రం ఆకాశం వైపు అలానే చూస్తూండి పోయాడు.

మరుసటి రోజు ఉదయం ఓ వార్త దావానలం లాగా ఆ వూరంతా వ్యాపించింది.

'ఏప్పటి లానే ఉదయం నడకకి వెళ్ళిన మామయ్య, ప్రమాదవశాత్తు కాలు..... జా....రి
..........................వాగులో...... పడి మ..ర...ణిం........చా....డని....'

                                  *                                           *                                           *

'దిభ్రాంతి.....' ముఖ్యంగా అతనికి. అతను కోలుకోలేకపోతున్నాడు...
'తన మామయ్య తను అన్న మాటలకి నొచ్చుకొని చనిపోయాడా'....అతనికి ఏంచేయలో అర్ధం కావడంలేదు...

ఆస్థి మిగుల్చుకొన్న బావమరది సంతోషంగా ఉన్నాడు....
అసలు విషయాలు తెలియని సంధ్య బాగానే ఉంది....
తప్పు చేసిన మామయ్యా 'తన దారి' తాను చుసుకున్నాడు....

 ప్రేమించిఒక్కటవుదామనుకున్న పాపానికి మేము బాధపడవలసి వస్తోంది....'

అలా ఆలొచిస్తూండాగానే అతని కళ్ళు అప్రయత్నంగా టీపాయ్ మీదనున్న దిన పత్రిక పై పడ్డాయి....వెంటనే పేపరు తీసుకోని గబ గబా చదివాడు....

మొదటి పేజిలో ఇలా రాసుంది....

'హైదరాబాదు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య'....
'ప్రియుని మోసానికి బలైనట్లు అనుమానం'...
'చనిపోయినప్పుడు ఆమె గర్బవతి అని తేల్చిన డాక్టర్లు'...
'నా చావుకు ఎవరూ కారణం కాదని లేఖ లభ్యం'...
'చనిపోయే ముందు తన ఫేసుబుక్, వాట్సాప్ తదితర అకౌంట్ లను క్లోస్ చేసినట్లుగా గుర్తింపు
'నేరం రుజువైతే నిందితులను వదలబోము అన్న మంత్రి'...

............

............

............

............

అతను అలానే సోఫా మీదకి ఒరిగిపోయాడు....తలను అలా వెనక్కు వాల్చి పైకి చూశాడు.....అతనికి తన మామయ్య చెప్పిన ఓ కథ, అందులోని నీతి మత్రమే గుర్తొస్తోంది.....

మంచి వాడైన...చెడ్డ వాడైనా...
తెలిసి చేసినా...తెలియక చేసినా...
తప్పు చేసిన ఎవరూ....శిక్ష నుంచి తప్పించుకోలేరు....

దురాలోచనతో చీకటిలో(ఎవరికి కనిపించకుండా) తప్పులు చేసే దొంగలు,స్మగ్లర్లు,టెర్రరిస్టులు,
లంచగొండి రాక్షసులూ, అన్యాయాన్ని ప్రశించలేని వారూ, స్వార్థం కోసం నిజాన్ని దాచే ప్రయత్నం చేసేవారు....
మోసగాళ్ళు...ఇలా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిక్షింపబడతారు....

'తామసి అంతే చీకటి అని అర్దం....'....మనిషి అఙ్ఞానంలో చేసే ఖర్మలే తామసి ర్మలు....

Friday 3 December 2010

పద్మ శ్రీ ఆర్ట్స్ - గురించి



పద్మ శ్రీ ఆర్ట్స్ సంస్థ, ప్రముఖ నాటక రచయత, దర్శకులు కళాదిత్య బిరుదాంకితులు, మా నాన్న శ్రీ బెల్లంకొండ రత్నం గారిచే స్థాపించబడినది .

పద్మ శ్రీ ఆర్ట్స్ - బెల్లంకొండ రత్నం గారి రచనల గురించి...
  • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోలియో, పౌష్టికాహారం, లలిత గేయాలు, దూరదర్శన్, ఆకాశవాణిలలో ప్రసారమయినవి.
  • 1994లో సారాసుర సం హారం గేయనాటికను ప్రభుత్వ సహకారముతో  సారా వ్యతిరేక ఉధ్యమంలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.
  • పరిశుభ్రత-పచ్చదనం, బ్రతకండి బ్రతకనివ్వండి గీతాలు పుస్తకాలుగా ముద్రించి స్థానికముగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకి ఉచితముగ సరఫరా చేసి, వాటిలో సంగీత నృత్య పోటీలు నిర్వహించడమైనది.
  • 2002 రాష్ట్ర నంది నాటక పోటీలలో పాల్గొని దర్పణం నాటికను స్వీయ దర్శకత్వంలో 2003 మే, 30న రవీంద్రభారతి, హైదెరాబాదులో విజయవంతముగా ప్రదర్శించబడినది.
  • శుచి-శుభ్రత కార్యక్రమం పై గీతాలు రచించి,రికార్డు చేయించి ప్రభుత్వమునకు ఇవ్వడమైనది.
  • 2015, ఫిబ్రవరి,మార్చి 2014లో జరిగిన అభినయ ఆర్ట్స్ వారి హనుమ, శ్రీ వేంకటేశ్వర నాట్యకళాపరిషత్ వారి గరుడ జాతీయ నాటక పోటీలలో అన్నమ్మాచార్య నాటకమును స్వీయ దర్శకత్వములో ప్రదర్శించి ఉత్తమ రచన, ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ బాల నటుడి అభినందన ప్రసంశాపురస్కారాలను పొందడమైనది.తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆర్థిక సహాయముతో అన్నమాచార్య నాటకమును పుస్తకముగా ముద్రించడమైనది.
  • 2015లో స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పై పాటలను రికార్డు చేయించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి బహూకరించడం జరిగింది.
  • పద్మ శ్రీ ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా స్వీయ దర్శకత్వంలో పలు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను ప్రదర్సించి ప్రధాన పాత్రలు పోషిండమైనది. నటుడిగ శ్రీ కృష్ణుడు, సుయోధనుడు, రావణాసురుడు, చాణిక్యుడు, చంద్రగుప్తుడు, జయసింహ, సారాసురుడు మరి కొన్ని సాంఘిక పాత్రలు మంచి గుర్తింపును తెచ్చాయి.
ఈతరంలో మా నాన్నలా కాకపొయినా అందులో పదొవంతుకి చేరుకోవడానికి మ అన్నయ్యా, నేనూ మావంతు ప్రయత్నం చేస్తున్నాం.

మ అన్నయ్య శ్రీ బెల్లంకొండ శ్రీకాంత్ గారి బ్లాగుని వీక్షించండి. 

నా వంతు ప్రయత్నం గా... నా రచనలని,భావాలని నా వంతు ప్రయత్నంగా మీతో పంచుకుంటున్నాను.
నా పేరు బెల్లంకొండ ఙ్ఞాన ప్రకాష్. పూర్తి వివరాలు త్వరలో ...